చాలా సంవత్యరాలు గడిచిపోయాయి, రాను రాను ఏలీయా ముసలివాడైపోతున్నాడు. తాను చనిపోయాక తన స్థానంలో మరొక దేవునికి ప్రవక్తగా ఉండవలసిన వ్యక్తికోసం వెతకడానికి ఏలీయా తొందరపడుతున్నాడు. ఒక రోజు దేవుడు ఏలీయాని ఎలీషా అనే అతని వద్దకు నడిపించాడు. ఏలీయా మాదిరిగానే ఎలీషా కుడా దేవుని ప్రేమించి, ఆయన చెప్పేది విని లోబడేవాడు. ఏలీయాకు సహాయం చెయ్యడానికి తాను దేవునిచేత ఏర్పరచబడినట్లు ఎలీషా తెలుసుకున్నాడు. గనుక వాళ్లిద్దరూ మంచి మిత్రులయ్యారు. తాను కలిసిన వాళ్లందరిలో ఏలీయానే చాలా ఉత్తముడని ఎలీషా అనుకున్నాడు.
ఒక రోజు ఏలీయా ఎలీషాను తీసుకుని చాలాదూరం నడుచుకుంటూ వెళ్ళాడు. తానీ లోకం విడిచి వెళ్లాల్సిన రోజు వచ్చిందని ఏలీయాకు తెలుసు. ఏలీయాను పరలోకం తీసుకువెళ్లడానికి దేవుడు చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు. ఈ సంగతి తెలిసినప్పుడు ఎలీషా చాలా దుఃఖించాడు. ఏలీయా ఎక్కడికి వెళితే అక్కడికి ఆయననే అనుసరించాలనుకున్నాడు ఎలీషా. కాబట్టి వాళ్లిద్దరూ అలా చాలాదూరం వరకు నడుచుకుంటూ వెళుతూనే ఉన్నారు. వారు యోర్దను నదికి చేరుకున్నప్పుడు,ఏలీయా తన దుప్పిటి తీసుకుని దానితో నీళ్లను కొట్టాడు. హఠాత్తుగా, ఆ నదిలో ఉన్న నీళ్లు వెనక్కి వెళ్లిపోయాయి, గనుక ఏలీయా, ఎలీషా ఆరిన నేల మీద ఆ నదిని దాటారు.
2 రాజులు 2
-నవీన్ కుమార్ యెలుమర్తి -