Tuesday, 30 October 2018

SALMON - WISE KING (సొలొమోను : జ్ఞానియైన రాజు )

సౌలు చనిపోయినప్పుడు ప్రజలు దావీదును తమ కొత్త రాజుగా ఎన్నుకొన్నారు. దావీదు మహారాజు గొప్ప రజ్జాన్ని కట్టుకుని, ఇశ్రాయేలువారి అనేక శత్రువులను ఓడించాడు. అతడు యెరూషలేమును కూడా వశపరుచుకొని ఆ నగరంలో తన పెద్ద రాజభవనాన్ని కట్టించాడు. దావీదు దేవుని వెంబడించి ఆయన మాటకు లోబడినాడు గనుక మంచి  అయ్యాడు. దావీదుకు అనేక విషయాల్లో నైపుణ్యం ఉంది. అతడు గొప్ప యోధుడే గాక చక్కని సంగీత విధ్వంసుడు, అద్భుతమైన కవి కూడాను. దావీదు సితార వాయించి, దేవుని ప్రేమ గురించి, మన జీవితాలలో ఎదురయ్యే కష్టాలలో దేవుని నమ్మడం గురించి చాలా పాటలు రాశాడు. 
    దావీదు కుమారుడైన సొలొమోను దావీదు తర్వాత రాజయ్యాడు. మంచి రాజుగా జ్ఞానంతో పరిపాలించడం కోసం తనకు జ్ఞానం ఇవ్వమని దేవునికి ప్రార్ధన చేశాడు గనుక సొలొమోను చాలా జ్ఞానియైన రాజు అయ్యాడు. సొలొమోను ఎంతో జ్ఞానము గలవాడంటే అనేక ఇతరదేశ ప్రజలు కూడా అతని జ్ఞానం కోసం విని, అతన్ని కలవడానికి, అతని జ్ఞానవాక్కులు వినడానికి ఎంతో దూరప్రాంతాల నుంచి కూడా వచ్చేవారు. 
        దేవుడు సొలొమోనుని గొప్ప ధనవంతుడిగా కుడా చేశాడు, ఇశ్రాయేలును పరిపాలించిన రాజులందరికంటే ఎక్కువ సంపద అతనికున్నది. అయితే సొలొమోను తమ సంపాదనంతా అతని కోసమే ఖర్చుపెట్టుకోలేదు యెరూషలేములో మొట్టమొదటి దేవాలయాన్ని కట్టడానికి కుడా ఆ సంపదను ఉపయోగించాడు. ఇది యెరూషలేములో ప్రత్యేకమైన దేవాలయం, దానిని కట్టడానికి చాల ఖర్చయింది. అందులో ఉన్నదంతా బంగారం,వెండి, దగదగ మెరిసే ముత్యాలతో పోతపోశారు. అందులో ఉండే వస్తువులన్నీ కూడా బంగారంతో చేసినవే. దేవాలయ నిర్మాణం ముగిశాక, సొలొమోను దానిని అధికారికంగా ఆరంభించినప్పుడు ఏడు రోజుల పాటు పెద్ద విందు జరిగింది.                                                                                                                 
                                                                                                                                         1రాజులు 2-10
                     -నవీన్ కుమార్ యెలుమర్తి-

Monday, 29 October 2018

SAUL- DAVID (సౌలు - దావీదు)

కొన్నేళ్ల తరువాత దావీదు యువకుడయ్యాక, సైన్యంలో నాయకుడయ్యాడు. అతడు చాలా యుద్ధాలు గెలిచాడు గనుక ప్రజలు "దావీదు సౌలుకంటే గొప్ప వీరుడు" అని పొగిడారు, ఈ మాటలు సౌలుకు ఎంతో అసూయ కలిగించాయి. అతడు రహస్యంగా దావీదును చంపడానికి మార్గాలు వెతుకుతున్నాడు. ఒక రోజు, వాళ్లిద్దరూ కలిసి భోజనం చేశాక, సౌలు తన ఈటెను దావీదు మీదికి విసిరాడు. 
   ఈటె దెబ్బ తప్పించుకున్న దావీదు పారిపోయి సౌలుకు కనబడకుండ దాక్కున్నాడు. దావీదు కొండల్లోకి పారిపోయాడు గాని సౌలు తన సేనలతో అతన్ని వెంటాడాడు. ఎలాగైనా దావీదును కనిపెట్టి చంపాలనుకున్నాడు. 
  ఒకరోజు సౌలు మనుషులు ఒక కొండ వద్దకు వచ్చారు అయితే దావీదు అతని జనులు అప్పటికే ఆ కొండా లోపల ఉన్న ఒక గుహలో దాక్కొని ఉన్నారు. సౌలు, అతని సైన్యం కూడా అదే గుహ ద్వారం దగ్గర ఆ రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు బాగా నిద్రలో ఉన్నప్పుడు దావీదు,అతని మనుషులు గుహ లోపలినుంచి నెమ్మదిగా వాళ్ళను సమీపించారు. 
    సౌలు తన ఈటెను ప్రక్కనే పెట్టుకొని నేల మీద పడుకొని, గాఢనిద్రలోకి జారుకున్నాడు. దావీదు మనుషులున్నారు, "చూడు! సౌలును చంపి రాజ్జాన్ని చేజిక్కించుకోవడానికి నీకిదే మంచి అవకాశం." అయితే దావీదు సౌలును చంపాలనుకోలేదు గనుక "అనేక సంవత్యరాల క్రితం దేవుడే సౌలును రాజుగా చేశాడు. కాబట్టి నేను అతన్ని చంపడం అంత మంచి పని కాదు" అన్నాడు. అయితే దావీదు సౌలు వేసుకున్న అంగిలో ఒక ముక్కను కత్తిరించి, మెల్లగా ఎవరికీ మెలుకువ రాకుండ వెళ్ళిపోయాడు. 
   ఆ తెల్లారి ఉదయాన్నే, ఒక కొండపైన నిలబడి సౌలును కేకవేసి పిలిచాడు. అతడు కత్తిరించిన సౌలు అంగిలోని ఆ ముక్కను పైకెత్తి పట్టుకొని, "కావాలనుకుంటే నిన్న రాత్రి నేను నిన్ను చంపివుండేవాడిని. కానీ నీకు ఎలాంటి హాని చెయ్యలేదు, నీవు నాగురించి భయపడవాల్సిందేమి లేదు. మరి నువ్వెందుకు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు?" అని అడిగాడు అప్పుడు సౌలు "నీవు చెప్పింది నిజమే దావీదూ. నీవు నాపట్ల దయచూపి, నా ప్రాణం తీయకుండ వదిలేశావు" అన్నాడు. అంతటితో సౌలు తన హృదయంలో దావీదును ఇంకా ద్వేషిస్తూనే ఉన్నాడు.  
                                                                                      1సమూయేలు 18-24
-నవీన్ కుమార్ యెలుమర్తి -

Friday, 19 October 2018

DAVID & GOLIATH (దావీదు-గొల్యాతు )

ఒక రోజు దావీదు అనే కుర్రాడు సైన్యంలో పని చేస్తున్న తన అన్నలను చూడడానికి యుద్ధ శిబిరానికి వచ్చాడు. దావీదు గొర్రెలు  కాచేవాడు. ఇశ్రాయేలు దేశంలో ఆ రోజుల్లో చిన్నవాళ్లు ఇంటిలో సహాయం చేయడం, గొర్రెలు కాయడం మాములే. దావీదు గొల్యాతును చూడగలిగాడు, అందరూ అతనికి ఎలా భయపడుతున్నారో కూడా చుశాడు. అయితే దావీదుకు భయంలేదు. 

        దావీదు నేరుగా సౌలు రాజు వద్దకు వెళ్లి, "నేను గొల్యాతుకు భయపడటంలేదు, అతనితో పోరాడతాను" అని చెప్పాడు. అందుకు సౌలు "నువ్వు చిన్న పిల్లవాడివి కదా, అంత గొప్ప బలాఢ్యుడితో పోరాడి అతన్ని ఎలా ఓడించగలవు?అన్నాడు. "నా గొర్రెలను దొంగిలించడానికి ప్రయత్నించిన సింహాలను, ఎలుగుబంటిలను సైతం దేవుని సహాయంతో నేను చంపాను. గొల్యాతుతో పోరాడానికి కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు" అని దావీదు బదులిచ్చాడు. 

  సౌలు ఈ ధైర్యవంతమైన మాటలు వినేసరికి, అతడు తన సొంత ఖడ్గాన్ని,శిరస్త్రాణాన్ని,కవచాన్ని దావీదుకి ఇచ్చాడు. అయితే ఆ శిరస్త్రాణము, కవచమూ చిన్నవాడైన దావీదుకు బరువుగా అనిపించాయి. గనుక వాటిని సౌలుకు తిరిగి ఇచ్చేశాడు. 
     వాటికి బదులు దావీదు ఐదు నున్నటి రాళ్లు ఏరుకున్నాడు. ఒక రాయిని తన ఒడిసెలలో పెట్టుకుని,గొల్యాతుతో పోరాడటానికి వెళ్ళాడు. దావీదు గొల్యాతును చూచి, "నాతో నీవు నీ ఖడ్గంతో,ఈటెతో నీకున్న బలమంతటితో పోరాడుతున్నావు. అయితే నేను దేవుడు నాకిచ్చే బలంతో పోరాడుతున్నాను"అని కేకలు వేశాడు. అప్పుడు దావీదు తన చేతిలో ఉన్న ఒడిసెలను గుండ్రంగా తిప్పుతూ తిప్పుతూ గొల్యాతు వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. 
     ఆ తర్వాత అతడు రాయి విసరగానే అది వెళ్లి గొల్యాతు రెండు కళ్ళకు పైన సరిగ్గా నుదిటిమీద తగిలింది. ఆ రాక్షసుడు నేలమీద బోర్లా పడిపోయాడు. దావీదు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వెళ్లి గొల్యాతు సొంత కత్తిని లాక్కుని అతని తల తెగనరికాడు. గొల్యాతు ఓడిపోయాడు. శూరుడైన గొల్యాతు ఒక చిన్న పిల్లవాడి చేతిలో ఓడిపోవడం చూచి ఖంగుతిన్న ఫిలిష్తీయులు అక్కడ నుండి పారిపోయారు. అయితే ఇశ్రాయేలు సేనలో ఉన్న సైనికులంతా ఒక్కసారిగా ఉత్సాహం తెచ్చుకొని, దేవుని సహాయంతో దావీదు గొల్యాతును ఓడించిన సందర్భాన్ని పండుగచేసుకున్నారు. దావీదు ఇశ్రాయేలులో ఒక గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. 
             
                                                                                                                             1సమూయేలు 17
 -నవీన్ కుమార్ యెలుమర్తి -

Tuesday, 16 October 2018

KING SOUL (సౌలు రాజు)

ఇశ్రాయేలీయులో సమూయేలు అనేక సంవత్యరాలు నాయకుడిగా ఉండి, ప్రజలకు దేవున్ని వెంబడించాలని బోధించాడు. అతడు మంచివాడు దేవుణ్ణి ప్రేమించాడు. అయితే సమూయేలు పెద్దవాడు అవుతున్నాడు. ఇశ్రాయేలీయులు వాళ్లకి ఓ కొత్త నాయకుడు కావాలని అడిగారు వాళ్ళకి కావలసింది కేవలం నాయకుడు కాదు, తక్కిన రాజ్జల వాళ్లందరికీ రాజులు ఉన్నట్లు గానే వాళ్ళకి కూడా నిజమైన రాజు కావాలని కోరుకున్నారు. కాబట్టి సమూయేలు ఎలాగైనా ఒక రాజు కాగలిగిన వ్యక్తిని వెదకి ఇశ్రాయేలును నడిపించాలని కోరారు. సమూయేలుకు ఇద్దరు కొడుకులున్నారు గాని వాళ్ళు యథార్థవంతులు లేక న్యాయంగా ఉండేవాళ్ళు కాదు. గనుక వాళ్ళని నమ్మలేరు .
      వాళ్ళకి బదులు, దేవుడు ఎన్నుకున్న రాజును సమూయేలు కనుగొన్నాడు, అతడు సౌలు అనే చూడముచ్చటైన యువకుడు. అతడు అందరికంటే భుజాలకు పైగా ఎత్తుగా ఉండేవాడు, మంచి బలాఢ్యుడైన వీరుడు. అతడు నిజంగా తమకు గొప్ప రాజుగా ఉంటాడని ప్రజలు ఆశించారు. ప్రత్యేకంగా తమ బద్ధశత్రువైన ఫిలిష్తీయులను అతడు ఓడిస్తాడన్న ఆశతో వాళ్ళున్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు క్రూరమైన శత్రువులు, పదేపదే ఇశ్రాయేలు మీద దాడులు చేస్తుండేవారు . రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అతడు 
   ఫిలిష్తీ సైన్యంలో గొల్యాతు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అతడు 9అడుగులు పైన ఎత్తుండేవాడు. అతడు ఇశ్రాయేలీయులను, దేవుడిని ఎగతాళి చేస్తున్నాడు. ప్రతిరోజూ, సౌలు సైన్యానికి దగ్గర్లో నిలబడి, ఎవడైనా వచ్చి తనతో యుద్ధం చేయమని సవాలు చేస్తుండేవాడు. "రండి, మీకు దమ్ముంటే నాతో పోరాడండి," అంటూ కేకలు వేసేవాడు. అయితే ఎవరు అతనితో పోరాడటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అతడు చాలా ఎత్తుగా బలంగా ఉండేవాడు. గనుక ఇశ్రాయేలు సైనికులంతా అతనికి భయపడ్డారు.
1సమూయేలు 17

-నవీన్ కుమార్ యెలుమర్తి -

Monday, 8 October 2018

SAM :THE BOY HEARD GOD'S VOICE( సమూయేలు దేవుని స్వరం విన్న పిల్లవాడు)

సంవత్యరాలు గడచిపోయాయి, ఇప్పుడు సమూయేలు వయస్సు 12 ఏళ్లు. ఒకరోజు రాత్రిపూట సమూయేలు మందిరంలో నిద్రపోతున్నప్పుడు, సమూయేలు ఒక స్వరం విన్నాడు. ఆ స్వరం అతని పేరు పిలుస్తుంది, "సమూయేలూ, సమూయేలూ!"అని.
   
ఏలి తన గదిలోనుంచి పిలుస్తున్నాడని భావించి అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. "మీరు నన్ను పిలిచారా?" అడిగాడు సమూయేలు. అయితే ఎలీ అతన్ని పిలవలేదు గనుక సమూయేలు తిరిగి తన పడకమీదికి మీదికి వెళ్ళిపోయాడు. 
       అయితే ఆ స్వరం రెండోసారి పిలిచింది. "సమూయేలూ, సమూయేలూ!" మరొకసారి సమూయేలు ఏలి వద్దకు పరిగెత్తాడు. మరల ఎలీ చెప్పాడు. "నేను నిన్ను పిలవలేదు. వెళ్లి పడుకో పో." తర్వాత సమూయేలు మూడో సారి స్వరం విన్నాడు, మరల ఏలి వద్దకు వెళ్ళాడు. ఎలీ అప్పుడు తెలుసుకున్నాడు సమూయేలు ఊరికే కలలుకనడం లేదని. "బహుశా దేవుడు నీతో మాట్లాడుతున్నాడనుకుంటా. సారి నీవు ఆ స్వరం విన్నప్పుడు, "ప్రభువా మాట్లాడు. నీ దాసుడనైన నేను ఆలకిస్తున్నాను" అని చెప్పమన్నాడు ఏలీ. 
        కొద్దిసేపటి తర్వాత సమూయేలు ఆ స్వరం విని, "ప్రభువా, నేను నీ దాసుణ్ణి, నీ మాట ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాను" అన్నాడు. ఆ రాత్రి నుంచి, దేవుడు చిన్ని సమూయేలుతో తరచుగా మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు దేవునితో మాట్లాడిన సంగతి   త్వరలోనే ప్రజలకు తెలిసిపోయింది. గనుక అనేక మంది ప్రజలు సలహా కోసం సమూయేలు వద్దకు వచ్చారు. జరగబోయే సంగతుల గురించి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు గనుక అతడు చిన్నవాడుగా ఉన్నప్పడే ప్రవక్త అయ్యాడు. కొంతకాలం తర్వాత, సమూయేలు యువకుడయ్యాక, అతడు ఎప్పుడెప్పుడు తమ నాయకుడు అవుతాడా అని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. 

                                                                                                                                                                                                                                            1సమూయేలు 1-3
-నవీన్ కుమార్ యెలుమర్తి -

        

HANNAH WANTED TO HAVE A BABY (బిడ్డ కావాలని కోరుకున్న హన్నా)

కొన్నేళ్ల తర్వాత సమూయేలు ఇశ్రాయేలీయుకు తదుపరి గొప్ప నాయకుడయ్యాడు. సమూయేలు పుట్టకముందు, అతని తల్లి హన్నా చాలా కాలం పిల్లలు కలగాలని ఎదురుచూసింది కానీ ఒక్కళ్ళు కూడా
పుట్టలేదు. ఆమె ఎల్కానా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి ఇద్దరు భార్యలు- హన్నా,పెనిన్నా, పెనిన్నానికి పిల్లలు ఉన్నారు కాని హన్నాకు లేరు. కాబట్టి ఆమె చాలా చాలా బాధపడింది. సంవత్యరాలు గడిచిపోయాయి, ఒక రోజు ఆమె దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంది. "నాకు ఒక కొడుకు పుడితే, వాడు జీవితాంతం నీకు ప్రత్యేకమైన సేవకుడిగా ఉంటాడు." అని చెప్పింది. 


         అప్పుడు దేవుడు ఆమెకు సమూయేలును ఇచ్చాడు. అతడు తన బట్టలు తానే వేసుకోగలిగినంత వాడైనప్పుడు హన్నా సమూయేలుని ఏలి అనే యాజకుడి వద్దకు తీసుకొచ్చింది ఏలి చాలా పెద్దవాడు గనుక అతనికి సహాయం అవసరమైంది. అతనికి కుడా ఇద్దరు కొడుకులున్నారు గాని వాళ్ళు పాడు పనులు చేస్తూ తీరికలేకుండా ఉన్నారు. ముసలివాడైన వాళ్ళ నాన్నగారికి సహాయం చెయ్యడం వాళ్ళకి ఇష్టం లేదు. హన్నా ఏలీతో ఇలా చెప్పింది. "సమూయేలు ఇక్కడ పనిచేస్తూ మీరు దగ్గర పెరగాలని నా కోరిక. ఇది సమూయేలు పుట్టకముందే నేను చేసుకున్న మొక్కుబడి గనుక ఇప్పుడు నేనా మొక్కుబడి తీర్చుకోవాలనుకుంటున్నాను."

        ప్రతి సంవత్యరం హన్నా  సమూయేలును చూడటానికి మందిరానికి వచ్చేది, ఆమె వచ్చిన ప్రతిసారి అతనికి ఒక కొత్త చొక్కా తెచ్చేది. యాజకుడైన ఏలీ సమూయేలును ఎంతగానో  ప్రేమించేవాడు. అతన్ని తన సొంత కొడుకుల భావించేవాడు. ఏలి  దేవుని గురించిన సంగతులన్నీ చెప్పి, దేవుని మందిరంలో సేవకుడిగా ఉండటం గురించి కుడా అతనికి అన్ని విషయాలు నేర్పించాడు. 
                                                                                     1సమూయేలు 1-3
- నవీన్ కుమార్ యెలుమర్తి -

SAMSON IN DAGON TEMPLE (దాగోను గుడిలో సమ్సోను )

ఒకరోజు, ఫిలిష్తీయులు తమ దేవత అయిన దాగోను గుడిలో ఒక పెద్ద విందు ఏర్పాటు చేసారు. ఆ విందు జరిగే సమయంలో వాళ్ళకు సమ్సోనును ఆటపట్టించాలన్న దుర్మార్గపు ఆలోచన వచ్చింది. అందుచేత వాళ్ళు సమ్సోనును చెరసాలలో నుంచి తీసుకొచ్చారు. "మాకు వినోదం కలిగించడానికి సమ్సోనును బయటకు తీసుకురండి " అంటూ వాళ్ళు కేకలు వేశారు అక్కడ దాదాపు 3000 మంది ప్రజలు పోగై, మద్యం త్రాగుడు ఎక్కువయ్యే కొద్ది మరింత దుర్మార్గంగా తయారయ్యారు. ఆ భవనానికి ఉన్న స్థంబాల మీద నిలబడి వాటిమీద చేతులు వేసివున్న గుడ్డి సమ్సోనును చూచి ప్రజలు నవ్వుతూ, హేళనచేస్తూ, మానసికంగా గాయపరుస్తున్నారు. 

    అందరూ విందులు చేసుకుంటూ ఉన్నారు గాని సమ్సోను చెరసాలలో ఉండగానే అతని జుట్టు చాలావరకు పెరిగిందన్న సంగతి వాళ్ళు మరచిపోయారు. సమ్సోను తన జీవితంలో చివరిసారిగా దేవునికి ప్రార్ధన చేశాడు , "దేవా, ఈ ఒక్కసారి నాకున్న శక్తిని మరొకసారి తిరిగి ఇవ్వు అని బ్రతిమాలాడు". 
 దేవుడు సమ్సోను పై  జాలి చూపి మరల బలవంతుణ్ణి చేశాడు . సమ్సోను తన బలంకొద్ది నెట్టాడు. ఆ పెద్ద స్థంబాలు విరిగిపోవడం మొదలై, పై కప్పు అందరిమీద ఒక్కసారిగా కూలిపోయింది. గుడిలో ఉన్న అధికారులమీద, ప్రజలందరిమీద ఆ గుడి పడిపోయిది. ఆ విధంగా సమ్సోను బ్రతికి ఉన్నప్పటికంటే చనిపోయేటప్పుడు ఎక్కువమందిని చంపేశాడు. అతడు ఇశ్రాయేలుకు 20 సంవత్యరాలు నాయకుడిగా ఉన్నాడు.  ఈ సారి సమ్సోను బ్రతికే అవకాశం దేవుడు ఇవ్వలేదు గానీ పరలోకంలో స్థానాన్ని దక్కించుకున్నాడు.                                                
                                 
                                                                             
                                                                                                                                    న్యాయాధిపతులు 16
-నవీన్ కుమార్ యెలుమర్తి-

SAMSON-DELILAH (సమ్సోను - దెలీలా)

సమ్సోను - దెలీలా గాజాలో దెలీలా అనే అమ్మాయి ఉండేది. ఆమెను సమ్సోను గాఢంగా ప్రేమించాడు. ఫిలీష్తియులు ఆమెను బెదిరించి, సమ్సోను అంత బలంగా ఎందుకున్నాడో, అతని రహస్యమేమిటో తెలుసుకుని ఆ రహస్యాన్ని మాకు తెలియచేయాలన్నారు. వారి బెదిరింపులకు భయపడిన దెలీలా అతని రహస్యమేమిటి చెప్పమని సమ్సోనుని బ్రతిమాలింది. మొదట్లో ఆమె అడిగిన రెండుసార్లు సమ్సోను ఆమెకు సత్యం చెప్పలేదు. అయితే మూడోసారి, దెలీలా ఏడుస్తూ, తన రహస్యమేమిటో చెప్పమని సమ్సోను నడిగింది. అప్పుడు సమ్సోను " నా తలవెంట్రుకలు గనుక కత్తిరించబడితే,నేను నా బలాన్ని కోల్పోయి, మాములు మనిషిలాగా బలహీనుడినవుతాను" అని చెప్పాడు అతడు రహస్యమంతా   చెప్పేశాడని దెలీలా నిర్ధారించుకొని, "ఇంకొకసారి వెనక్కి రండి అతడు నాకు అంతా చెప్పేశాడని" అంటూ ఫిలీష్తి అధికారులకు కబురు చేసింది. సమ్సోను నిద్రపోతున్న సమయంలో, దెలీలా అతని జుట్టంతా కత్తిరించింది. వెంటనే సమ్సోను బలము అతన్ని విడిచిపోయింది. 


     ఇప్పుడు ఫిలీష్తియులుసమ్సోనుని సునాయాసంగా పట్టుకొని చెరసాలలో వేశారు. అతడు చెరశాలనుంచి తప్పించుకుపోతాడని భయపడి అతని కళ్ళు ఊడబెరికి అతన్ని గుడ్డివాణ్ణి చేశారు. చెరశాలలో సమ్సోను చేత వాళ్ళు బలవంతంగా ధాన్యం విసరడానికి ఒక పెద్ద రాయిని తిప్పించారు. అయితే క్షౌరం చేయించిన తర్వాత అతని తలమీద వెంట్రుకులు మళ్ళీ పెరగసాగాయి.                         
                                                                                                                                   న్యాధిపతులు 16
-నవీన్ కుమార్ యెలుమర్తి -

Friday, 5 October 2018

STRONG SAMSON (బలవంతుడైన సమ్సోను )

గిద్యోను మరణించినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు కొత్త న్యాయాధిపతిని,నాయకుడిని పంపాడు. అతని పేరు సమ్సోను. సమ్సోనుతో అతని తల వెంట్రుకలు ఎప్పుడు కత్తిరించుకోకూడదని చెప్పాడు."నీవు గనుక నీ తల వెంట్రుకలు కత్తిరించకుండా ఉన్నట్లయితే, నిన్ను భూమి మీద జీవించే వాళ్ళందరికంటే బలవంతుణ్ణి చేస్తాను"అని చెప్పాడు. సమ్సోను దేవుడు మాట విని తన తల వెంట్రుకలు కత్తిరించుకోలేదు. గనుక అతనికి పొడవైన జుట్టు, బారు గడ్డం ఉండేవి. 

   ఒక యువకుడిగా సమ్సోను సింహబలుడని అప్పటికే నిరూపించుకున్నాడు. ఒకసారి తన పై దాడిచేసిన ఒక పెద్ద బలమైన సింహముతో అతడు పోరాడినాడు. అయితే సమ్సోను ఎంత బలవంతుడంటే, ఒట్టి చేతులతోనే ఆ సింహాన్ని తేలిగ్గా చంపేశాడు. 

    ఇశ్రాయేలియులకు తమ పొరుగువాలతో చాలా సమస్యలొచ్చేవి, మరి ముఖ్యంగా ఫిలిష్తీయులతే, వాళ్ళకి ఎన్నో సమస్యలు సృష్టించేవారు. ఒక రోజు రాత్రి సమ్సోను గాజా అనే పట్టణంలో బసచేస్తున్నప్పుడు. ఆ పట్టణానికి చుట్టూ ఎతైన పెద్ద గోడలు, భద్రత కోసం పెద్ద ద్వారాలు ఉండేవి. సమ్సోను ఆ పట్టణంలో ఉన్నాడని ఫిలిష్తీయులు  కనిపెట్టినప్పుడు, వాళ్ళు అతన్న పట్టుకోవాలనుకున్నారు. పట్టణం లోపలే అతన్ని బంధించాలనే ఉద్దేశంతో వాళ్ళు  ఆ పెద్ద ద్వారాలకు తాళం వేశారు. అయితే సమ్సోను ఆ ద్వారాలను సులభంగా గోడలోనుంచి ఛేదించి, వాటిని తన భుజాల మీద వేసుకొని ఊరుదాటి వెళ్ళిపోయాడు. సమ్సోను ఎంత బలవంతుడో చూచిన ఫిలిష్తీయులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. 
 న్యాయాధిపతులు 13

-నవీన్ కుమార్ యెలుమర్తి-

300 GIDEON'S MEN (300 మంది గిద్యోను మనుషులు )

మిద్యానీయుల మీద దాడి చేయడం కోసం గిద్యను వీలైనంత ఎక్కువ మందిని సైనికులుగా సమకూర్చుకున్నాడు. అనేక వేలమంది గిద్యోను సైన్యంలో చేరారు. అయితే ఆ సైన్యం చాలా పెద్దయిందని, వారిలో ఎక్కువ మందిని ఇంటికి పంపివేయాలని దేవుడు గిద్యోనుతో చెప్పాడు. నిజానికి, గిద్యోను తన సైన్యంలోనుంచి మనుషులను పంపివేయమని దేవుడు చాలా సార్లు అడిగాడు. చివరికి, గిద్యోనుకు మిగిలింది కేవలం 300 మంది మనుషులే. అయితే యుద్ధంలో గెలవడానికి వాళ్ళు చాలు అని దేవుడు గిద్యోనుకు భరోసా ఇచ్చాడు. 

         కేవలం 300 మందితో అంత పెద్ద మిద్యాను సైన్యాన్ని జయించడానికి దేవుని దగ్గర చాలా తెలివైన పథకమే ఉంది. సైన్యంలో ప్రతి ఒక్కడూ ఒక్కొక్క దివిటీ, ఒక మట్టి కుండ, ఓ కొమ్ము తీసుకువెళ్లాలని దేవుడు గిద్యోనుకు వివరించాడు. తమ దివిటీలను వెలిగించుకోవాలి గాని వాటిని మట్టి కుండలో దాచి పెట్టాలని గిద్యోను తన సైన్యకులకు ఆదేశించాడు. ఈ విధంగా వాళ్ళు ఎవరికంటా పడకుండా మిద్యాను శిబిరంలోకి జొరబడవచ్చన్న మాట. 
       తర్వాత గిద్యోనుసంకేతాన్ని అనుసరించి, అందరూ తమ మట్టికుండలను బద్దలుకొట్టేసారు. పెద్దగా ఊదుతున్న బూరల శబ్దం విన్న మిద్యానీయులు నిద్రలోనుంచి మేలుకున్నారు. వారావిధంగా లేచినప్పుడు కనిపించేలా గిద్యోను తన మనుషులను కొండా మీద కుడా నిలబెట్టాడు. ఆవిధంగా కొండలమీద వెలుతురు, పెద్దగొలగా వినబడుతున్న  కొమ్ము శబ్దం వింటుంటే, ఒక పెద్ద సైన్యమే వాళ్ళు చుట్టూ కమ్ముకుని ఉన్నట్లు, తప్పించుకోడానికి దారే లేనట్లు కనబడింది. 
      మిద్యానీయులు తమ గుడారాల్లోనుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ పారిపోతారు. అయితే చీకట్లో ఒకరికి ఒకరు ఎదురై, అప్పటికే శత్రువులు తమ శిబిరంలో జొరబడి యుద్ధం చేస్తున్నారని భావించారు. అందుచేత, మిద్యానీయులు వాళ్లలో వాళ్లే కొట్లాడుకుని తమను తామే నాశనం చేసుకున్నారు. ఈ విధంగా దేవుడు గిద్యోనుకు అతని 300 మంది సైనికులకు చాలా పెద్ద సైన్యం మీద  మహా గొప్ప విజయాన్ని అందించాడు. 

Thursday, 4 October 2018

GIDEON-STAINED WOOL (గిద్యోను-తడిసిన ఉన్ని)

మోషేలాగే, యెహోషువ కూడా మంచి ఇశ్రాయేలు నాయకుడు. అయితే యెహోషువ చనిపోయాక ఇశ్రాయేలీయుల దేవుని గురించి మరచిపోయారు. కాబట్టి ఇతర దేశాల సైన్యాలు ఇశ్రాయేలులో ప్రవేశించి వాళ్ళు ఆహారాన్ని, పశువులను దోచుకుపోయారు. అయితే ఇశ్రాయేలీయులు దేవుని క్షమాపణ అడిగి, ఆయనకు ప్రార్ధన చేయటం మొదలుపెట్టిన ప్రతి సారి దేవుడు వాళ్ళకి సహాయం చేసేవాడు. దేవుడు వాళ్ళకి సహాయం చేసే విధానమేమిటంటే, గొప్ప ధైర్యవంతులు, బాగా నైపుణ్యమున్న యోధుల్ని పంపేవాడు. ఈ గొప్ప నాయకుల్ని న్యాయధిపతులు అని పిలిచేవారు, వారిలో గిద్యోను ఒకడు. 

     దేవుడు తనకిచ్చిన పని చెయ్యడానికి మొదట్లో గిద్యోను భయపడ్డాడు. అతడు ఇశ్రాయేలును తన బలమైన శత్రవుల నుంచి ఎలా రక్షించగలడు?గిద్యోను దేవునితో "నీవు నన్ను నిజంగా ఓ నాకుడిగా ఉండాలని కోరుతున్నావని నాకు చూపించు, దాన్ని రుజువు చేయడం కోసం నాకొక సూచననివ్వు" అన్నాడు. అప్పుడు గిద్యోను ఒక నూలు గడ్డను నేల మీద పెట్టి, "ఈ రాత్రి, నేను నిద్రపోయినప్పుడు, ఈ ఉన్నిని మంచుతో తడిసిపోయేలా చేసి,నేలను మాత్రం పొడిగా ఉంచాలి" అని దేవునితో  చెప్పాడు. ఉదయాన్నే  గిద్యోను ఆ  ఉన్నిని చూడడానికి బయటకెళ్ళి చూస్తే అది సరిగ్గా గిద్యోను అడిగినట్లే ఉంది. 
         అయితే గిద్యోనుకు ఇంకా భయంగానే ఉంది, గనుక మరుసటిరోజు రాత్రి ఆ ఉన్నిని మరల బయటపెట్టాడు. ఈ సారి దేవునితో "నన్ను క్షమించు, నీ దగ్గర నుంచి నాకు మరో సుచన కావాలి.రేపు ఉదయం ఉన్నుని పొడిగా ఉంచి నేలను తడుపు" అన్నాడు. అతడు నిద్రలేచినప్పుడు ఉన్ని పొడిగా ఉంది. గాని మంచు మాత్రం నేలా మీద అంతటా పడింది. ఇప్పుడు గిద్యోనుకు ఖచ్చితంగా తెలుసు, దేవుడు తనని ఇశ్రాయేలులో ఒక నాయకుడిగా, న్యా  ధిపతిగా ఉండమని కోరుతున్నాడని. 
                                                                                                                        న్యాయాధిపతులు 6




















                                                                                                         -నవీన్ కుమార్ యెలుమర్తి -

JERICHO WALLS (యెరికో గోడలు )

దాదాపు నలభై సంవత్యరాలు తరువాత , ప్రజలు కనానులో ప్రవేశించాల్సిన సమయం వచ్చిందని దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు మోషే ముసలివాడయ్యాడు, పైగా తాను ప్రజలను వాగ్దాను దేశంలోనికి నడిపించబోవడం  లేదని కూడా అతనికి తెలుసు. అతనికి బదులుగా యెహోషువను ఇశ్రాయేలీయులకు కొత్త నాయకుడిగా ఎన్నుకున్నాడు. 
        అప్పుడు  వాళ్ళు యెరికో అనే పెద్ద పట్టణానికి  చేరుకున్నారు. ఆ పట్టణం చుట్టూ ఎతైన పెద్ద గోడ ఒకటి ఉంది. అయితే యెహోషువకు మాత్రం చింతలేదు, ఎందకంటే ఆ పట్టణాన్ని ఎలా జయిస్తారో దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి వచ్చే ఆరు రోజుల్లో ప్రతి రోజూ ఆ పట్టణం చుట్టూ తిరగాలని యెహోషువ తన సైన్యాలకు ఆదేశించాడు. 
       తర్వాత, ఏడవ రోజున పట్టణం చుట్టూ సైన్యాలకు ముందుండి నడిపిస్తున్న యాజకులు బూరలు ఊదాలని, ప్రజలేమో పెద్దగా కేకలు వెయ్యాలని చెప్పాడు. యెరికో గోడలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. వెంటనే ఇశ్రాయేలీయులు తేలికగా ఆ పట్టణాన్ని వశపరచుకున్నారు. 
        చివరికి, ఇన్నేళ్ల పాటు ఎడారిలో ఉన్న తరువాత, ఇశ్రాయేలీయులు తమ సొంత భూమిని దక్కించుకున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పటికి నెరవేర్చాడు. 

                                                                                  యెహోషువ 1-6 
-నవీన్ కుమార్ యెలుమర్తి-

12 SPIES (పన్నెండు మంది గూఢచారులు)

అనేక నెలలు ప్రయాణం చేసిన తర్వాత ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దుల దాకా వస్తారు. చాలా సంవత్యరాల క్రితం దేవుడు అబ్రాహాము,ఇస్సాకు,యాకోబులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశమే ఈ కనాను. దేవుడు మోషేతో "ఈ దేశం ఎలావుంటుందో చూడటానికి కొంతమంది మనుషులను పంపు" మని చెప్పాడు. మోషే పన్నెండు మందిని ఎన్నుకుని, వారు వెళ్లి ఆ దేశం మంచిదేనేమో చూచి, అక్కడి సైన్యం బలమైనదా కాదా తెలుసుకుని రమ్మని చెప్పి పంపాడు. 

   కొంతకాలం తర్వాత ఆ మనుషులు పాళేనికి తిరిగివచ్చారు. "అది చాలా అద్భుతమైన దేశమే గాని మనము కనానులో ప్రవేశించలేము, ఎందుకంటే అక్కడి ప్రజలు గొప్ప శూరులు, మహా యెధులు" అని చెప్పారు గూఢచారులు. ప్రజలు ఈ మాటలు విన్నప్పుడు భయపడ్డారు. వాళ్ళు మోషేతో "నీవు మమ్మల్నేందుకు ఈ ఎడారిలోకి తీసుకొచ్చావు? మేము ఐగుప్తులో ఉన్నప్పుడే క్షేమముగా ఉన్నాం" అంటూ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు.  

    అయితే ఆ గూఢచారులలో యెహోషువ, కాలేబు అనే ఇద్దరు మాత్రం "భయపడకండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు!. అని చెప్పారు. కానీ ప్రజలు ఇంకా భయపడుతూ, వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడలేదు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోప్పడ్డాడు. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తాడని వాళ్ళు నమ్మడం లేదు. అందుకని దేవుడు వాళ్ళతో ఇలా అన్నాడు. "మీరు భయపడి నన్ను నమ్మడం లేదు గనుక నేను ఇప్పుడే మీకు ఈ వాగ్దాన దేశాన్ని ఇవ్వను. మరో నలభై సంవత్యలు మీరు ఎడారిలోనే ఉండాలి. మీ అందరిలో కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే నన్ను నమ్మారు గనుక, వాళ్లిద్దరే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు."

                                                                                                                             సంఖ్యాకాండము 13-14
-నవీన్ కుమార్ యెలుమర్తి -
                                                                                                                                

Wednesday, 3 October 2018

TEN COMMANDMENTS (పది ఆజ్ఞలు )

 ఇశ్రాయేలీయులు ఆ పెద్ద ఎడారిలో తమ ప్రయాణం కొనసాగించారు. ఒక రోజు వాళ్ళు మోషే ఎక్కడైతే మండుతున్న పొదను చూశాడో, అదే కొండ దగ్గరకు వచ్చారు. అప్పుడు వాళ్లంతా తమ గుడారాలు అక్కడ వేసుకుని కొంతకాలం ఉండాలని నిర్నయయించుకున్నారు. వాళ్ళు తల పైకెత్తి చూడగానే ఒక పెద్ద మేఘం ఆ  పర్వతాన్ని కప్పేసింది. ఆ మేఘంలో నుంచి మెరుపులు మెరిశాయి. ఓ పెద్ద ఉరుము భూమిని కుదిపేసింది. ఆ పర్వతం మీద దేవుడున్నాడు.


         మోషే దేవునితో మాట్లాడడానికి పర్వతం మీదికి వెళ్ళాడు. దాదాపు నలభై రోజులు మోషే ఆ కొండ మీదే  ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. తన ప్రజలు లోబడడానికి దేవుడు మోషేకి ధర్మశాస్త్ర నియమాలను ఇచ్చాడు. వీటిలో పది చట్టాలను దేవుడే స్వయంగా రెండు పెద్ద రాతి పలకలమీద చెక్కాడు ఈ చట్టాలను పది ఆజ్ఞలు అంటారు. ఈ పది ఆజ్ఞలు ఏమని చెబుతాయంటే. 

        1. దేవుడినే పూజించు 
        2. వేరొకరిని గాని వేరొకదానిని గాని పూజించ వద్దు 
        3. పూజించడానికి ఏ విధమైన విగ్రహమును గాని, బొమ్మను గాని చేసుకొనవద్దు 
        4. ఏడవ రోజున పరిశుద్ధంగా ఉంచి, ఆరు రోజుల్లో నీ పని చేసుకో 
        5. నీ తండ్రిని నీ తల్లిని గౌరవించు
        6. చంపవద్దు 
        7. నీవు పెళ్లి చేసుకున్నప్పుడు నీవు చేసిన ప్రమాణాలను భంగం చేయవద్దు 
        8. దొంగతనం చేయవద్దు 
        9. అబద్ధాలు చెప్పవద్దు 
       10. వేరొక వ్యక్తికి చెందిన దేనికోసము ఆశపడవద్దు . 
  
  మోషే ఈ పది ఆజ్ఞలను పాలెంలోనికి తీసుకువెళ్లి వాటిని చదివి ప్రజలకు వినిపించాడు. "మనము దేవుని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కట్టబోతున్నాము. అది ప్రత్యేక్షపు గుడారము అనబడే పెద్ద అందమైన గుడారం" అని మోషే వాళ్ళతో చెప్పాడు. పాళెం మధ్యలోనే వాళ్ళు ఆ గుడారాన్ని నిర్మించారు దానికోసం రంగురంగుల తెరలు తయారుచేసి, గుడారాన్ని వెండి బంగారంతో అలంకరించారు. ప్రత్యేక్ష గుడారం నిర్మాణం అయిపోయినప్పుడు, ఒక మేఘం ప్రత్యక్షపు సరిగ్గా ఆ గుడారం పైనే ఆవరించి ఉంది. దేవుడు తమతో ఎల్లప్పుడూ ఉన్నాడని, ఆ మేఘం వారికి సంకేతంగా నిలిచింది .  

                                                                                                                                                                                                 నిర్గమకాండము 16-17
-నవీన్ కుమార్ యెలుమర్తి-