ఒక రోజు దావీదు అనే కుర్రాడు సైన్యంలో పని చేస్తున్న తన అన్నలను చూడడానికి యుద్ధ శిబిరానికి వచ్చాడు. దావీదు గొర్రెలు కాచేవాడు. ఇశ్రాయేలు దేశంలో ఆ రోజుల్లో చిన్నవాళ్లు ఇంటిలో సహాయం చేయడం, గొర్రెలు కాయడం మాములే. దావీదు గొల్యాతును చూడగలిగాడు, అందరూ అతనికి ఎలా భయపడుతున్నారో కూడా చుశాడు. అయితే దావీదుకు భయంలేదు.
దావీదు నేరుగా సౌలు రాజు వద్దకు వెళ్లి, "నేను గొల్యాతుకు భయపడటంలేదు, అతనితో పోరాడతాను" అని చెప్పాడు. అందుకు సౌలు "నువ్వు చిన్న పిల్లవాడివి కదా, అంత గొప్ప బలాఢ్యుడితో పోరాడి అతన్ని ఎలా ఓడించగలవు?అన్నాడు. "నా గొర్రెలను దొంగిలించడానికి ప్రయత్నించిన సింహాలను, ఎలుగుబంటిలను సైతం దేవుని సహాయంతో నేను చంపాను. గొల్యాతుతో పోరాడానికి కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు" అని దావీదు బదులిచ్చాడు.
సౌలు ఈ ధైర్యవంతమైన మాటలు వినేసరికి, అతడు తన సొంత ఖడ్గాన్ని,శిరస్త్రాణాన్ని,కవచాన్ని దావీదుకి ఇచ్చాడు. అయితే ఆ శిరస్త్రాణము, కవచమూ చిన్నవాడైన దావీదుకు బరువుగా అనిపించాయి. గనుక వాటిని సౌలుకు తిరిగి ఇచ్చేశాడు.
వాటికి బదులు దావీదు ఐదు నున్నటి రాళ్లు ఏరుకున్నాడు. ఒక రాయిని తన ఒడిసెలలో పెట్టుకుని,గొల్యాతుతో పోరాడటానికి వెళ్ళాడు. దావీదు గొల్యాతును చూచి, "నాతో నీవు నీ ఖడ్గంతో,ఈటెతో నీకున్న బలమంతటితో పోరాడుతున్నావు. అయితే నేను దేవుడు నాకిచ్చే బలంతో పోరాడుతున్నాను"అని కేకలు వేశాడు. అప్పుడు దావీదు తన చేతిలో ఉన్న ఒడిసెలను గుండ్రంగా తిప్పుతూ తిప్పుతూ గొల్యాతు వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.
ఆ తర్వాత అతడు రాయి విసరగానే అది వెళ్లి గొల్యాతు రెండు కళ్ళకు పైన సరిగ్గా నుదిటిమీద తగిలింది. ఆ రాక్షసుడు నేలమీద బోర్లా పడిపోయాడు. దావీదు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వెళ్లి గొల్యాతు సొంత కత్తిని లాక్కుని అతని తల తెగనరికాడు. గొల్యాతు ఓడిపోయాడు. శూరుడైన గొల్యాతు ఒక చిన్న పిల్లవాడి చేతిలో ఓడిపోవడం చూచి ఖంగుతిన్న ఫిలిష్తీయులు అక్కడ నుండి పారిపోయారు. అయితే ఇశ్రాయేలు సేనలో ఉన్న సైనికులంతా ఒక్కసారిగా ఉత్సాహం తెచ్చుకొని, దేవుని సహాయంతో దావీదు గొల్యాతును ఓడించిన సందర్భాన్ని పండుగచేసుకున్నారు. దావీదు ఇశ్రాయేలులో ఒక గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు.
1సమూయేలు 17
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment